For Money

Business News

క్రెడిట్‌ కార్డుల కోసం అనుబంధ సంస్థ

క్రెడిట్‌ కార్డుల వ్యాపారం కోసం ప్రత్యేక అనుబంధ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు కెనెరా బ్యాంక్‌ మేనేజింగ్ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎల్‌ వి ప్రభాకర్‌ తెలిలిపారు. గడచిన రెండు ఏళ్ళలో క్రెడిట్ కార్డ్‌ పోర్టుఫోలియా బాగా పెరిగిందని, ప్రస్తుతం బ్యాంక్‌ వద్ద 9,23,000 క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌ ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌బీఐ తరవాత తమకే ఎక్కువ ఉన్నాయని అన్నారు. యాక్టివేషన్స్‌ బాగా పెరుగుతున్నందున ఈ వ్యాపారం కోసం ప్రత్యేక అనుబంధ కంపెనీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరో ఆరు నెలల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
65% పెరిగిన లాభం
మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్‌ రూ.1,666.22 కోట్ల స్టాండ్‌లోన్‌ నికర లాభాన్ని ప్రకటించింది.అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,010.87 కోట్ల లాభంతో పోలిస్తే 64.90 శాతం అధికమని బ్యాంక్‌ పేర్కొంది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీ ఆదాయం పెరగడమే దీనికి ప్రధాన కారణమని బ్యాంక్‌ పేర్కొంది. బ్యాంక్‌ ఆదాయం ఇదే త్రైమాసికంలో రూ.22,323.11 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ ఆదాయం రూ. రూ.21,040.63 కోట్లు. ప్రతిషేరుకు రూ.6.50 డివిడెండ్‌ను ప్రకటించింది.