కెనరా బ్యాంక్ ఫలితాలు సూపర్
సెప్టెంబరుతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కెనరా బ్యాంక్ నికర లాభం ఏకంగా 89 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.1,333 కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 89 శాతం చెంది రూ.2,525 కోట్లకు చేరింది. బ్యాంక్ మొత్తం ఆదాయం కూడా రూ.21,331.49 కోట్ల నుంచి రూ.24,932.19 కోట్లకు పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన కాలంలో బ్యాంక్ నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 8.42 శాతం నుంచి 6.37 శాతానికి తగ్గినట్లు కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎల్వీ ప్రభాకర్ తెలిపారు. అలాగే నికర ఎన్పీఏలు కూడా 3.22 శాతం నుంచి 2.19 శాతానికి తగ్గాయన్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో మొండి పద్దుల కోసం రూ.2,745.03 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రెండో త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 18.51 శాతం వృద్ధితో రూ.6,273 కోట్ల నుంచి రూ.7,434 కోట్లకు పెరిగిందని ప్రభాకర్ వెల్లడించారు.