వెండి తళతళ… క్రూడ్ జూమ్
కరెన్సీ మార్కెట్లో డాలర్ భారీగా క్షీణించడంతో క్రూడ్ ఆయిల్, బులియన్ మార్కెట్ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. యుద్ధానికి సంబంధించి రష్యా, ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న చర్చలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో ఆయిల్ మళ్ళీ పుంజుకుంది. దీనికి తోడా బలహీన డాలర్‌తో ఇవాళ బ్రెంట్ క్రూడ్ దాదాపు 9 శాతం పెరిగి 106.62 డాలర్లకు చేరింది. WTI క్రూడ్ కూడా 8 శాతం పైగా పెరిగి 102.72 వద్ద ట్రేడవుతోంది. ఇక బులియన్ మార్కెట్లో బంగారం కన్నా వెండిలో భారీ కొనగోళ్ళు జరుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో 3.74 శాతం లాభంతో వెండి 25.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే బంగారం 1.8 శాతం లాభంతో 1944 వద్ద ట్రేడవుతోంది. ఇక మార్కెట్లో అంటే ఎంసీఎక్స్‌లో బులియన్ ధరలు బాగానే పెరుగుతున్నాయి. ఏప్రిల్ కాంట్రాక్ట్ స్టాండర్డ్ బంగారం ధర రూ.545 పెరిగి రూ.51,692ల వద్ద ట్రేడవుతోంది. అదే ఏప్రిల్ వెండి కాంట్రాక్ట్ 1.96 శాతం అంటే రూ.1316 పెరిగి రూ.68,620 వద్ద ట్రేడవుతోంది.