ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్
జనం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేలా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు… వివిధ రాయితీలు ఎత్తివేస్తూ… ఈ రంగానికి వెన్నుపోటు పొడుస్తున్నాయి. రూ. 5 లక్షలకు మించి ప్రీమియం ఉన్న పాలసీలకు ఇపుడు ఉన్న పన్ను మినహాయింపులను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎత్తివేశారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధిక ప్రీమియం ఉన్న పాలసీలకు పన్ను మినహాయింపులు ఉండరాదని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఒక పాలసీదారుని వద్ద ఏప్రిల్ 1, 2023వ తేదీన లేదా ఆ తరవాత జారీ చేసిన పాలసీల ప్రీమియం మొత్తం రూ. 5లక్షలకు మించితే పన్ను మినహాయింపు ఉండదని ఆర్థిక మంత్రి చెప్పారు. అయితే ఇందులో యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీను కలపరు. రూ. 2.5 లక్షలు మించిన యూలిప్‌లకు 2021 బడ్జెట్‌లోనే బీమా మినహాయింపులు ఎత్తివేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇవాళ స్టాక్ మార్కెట్‌లో బీమా కంపెనీల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది.