ఈ షేర్లపై అయోధ్య ఎఫెక్ట్
అయోధ్యలో ఇవాళ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దీంతో అయోధ్యకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నారు. అయోధ్య అంశాన్ని రాజకీయాలకు ఉపయోగించే కార్యక్రమాన్ని ఇప్పటికే బీజేపీ ప్రారంభించింది. ఈ నెల 24వ తేదీ నుంచి శ్రీరామ జన్మభూమి దర్శన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిచనుంది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. రోజూ సగటున పాతిక వేల మంది అయోధ్యను సందర్శిస్తారని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు వచ్చే యాత్రికులకు భోజనం సదుపాయంతో పాటు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అయోధ్యకు భారీగా యాత్రికులు వచ్చే అవకాశం ఉన్నందున… ఈ అంశంతో ముడిపడి ఉన్న నాలుగు షేర్లను కొనుగోలు చేయొచ్చని కొంత మంది విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విమానం ద్వారా అయోధ్యకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున… ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరును కొనుగోలు చేయొచ్చని కొందరు అనలిస్టులు సలహా ఇస్తున్నారు. ప్రధాన మెట్రో నగరాల నుంచి ఇంటర్‌గ్లోబ్ తన సర్వీసులను పెంచనుంది.అలాగే అయోధ్య స్మార్ట్ సిటీ ప్రాజెక్టు దక్కించుకున్న అల్లయిడ్ డిజిటల్ సర్వీసెస్ షేరునున కొందరు సూచిస్తున్నారు. గడచిన మూడు నెలల్లో ఈ షేర్ 30 శాతంపైగా పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని… విదేశీ ఇన్వెస్టర్లు కూడా కంపెనీలో వాటాలు కొంటున్నారని అనలిస్టులు చెబుతున్నారు. అలాగే ఈజీ ట్రిప్ ప్లానర్స్ షేర్‌ను కూడా కొందరు రెకమెండ్ చేస్తున్నారు. వీటితో పాటు టూరిజం పరిశ్రమతో ముడిపడి ఉన్న థామస్ కుక్ షేర్‌ను కూడా కొనుగోలు చేయొచ్చని మరికొందరి సలహా. ఈ షేర్ కూడా గత అక్టోబర్ నుంచి 35 శాతం పెరిగింది. ఈ షేర్లలో భారీగా పెరిగే ఛాన్స్ ఇంటర్గ్లోబ్కు ఉందని తెలుస్తోంది. ఇదే అంచనాలతో గత కొన్ని రోజుల నుంచి ఐఆర్సీటీసీ, ఇండియన్ హోటల్స్, ప్రావేగ్ షేర్లు భారీగా పెరుగుతున్నాయి.