For Money

Business News

దేశీయ మార్కెట్‌పై అరబిందో కన్ను

ఇప్పటి వరకు విదేశాల నుంచి అధిక టర్నోవర్‌ సాధిస్తున్న హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా ఇపుడు దేశీయ మార్కెట్‌పై శ్రద్ధ చూపిస్తోంది. కొత్త యూనిట్లను పెట్టడం లేదా ఇతర కంపెనీలను టేకోవర్‌ చేయడం ద్వారా దేశీయ ఫార్ములేషన్స్‌ బిజినెస్‌లో భారీ ఎత్తున ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించింది. మూడేళ్ళలో రూ.1000 కోట్ల టర్నోవర్‌ సాధించాలని నిర్ణయించినట్లు కంపెనీ ఛైర్మన్‌ పీవీ రామ ప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఫలితాలు తరవాత అనలిస్టులతో ఆయన కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాట్లాడారు. సమావేశం వివరాలను కంపెనీ వెల్లడించింది.బ్రాండెడ్‌ ఫార్ములేషన్లు, ఓవర్‌ ద కౌంటర్‌ (ఓటీసీ) పోర్టుఫోలియోతో పాటు పర్సనల్‌ కేర్‌ ప్రొడక్ట్ప్‌ రంగంలో విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. ఈ మార్కెట్‌లో విస్తరించేందుకు అవసరమైన ఉత్పత్తి సామర్థ్యం ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్‌ (పీఎల్‌ఐ) స్కీమ్‌ను ఉపయోగించుకుంటున్న కంపెనీ.. ఆ మేరకు రూ.400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.

కాకినాడ ప్లాంట్‌కు సిద్ధం

కాకినాడ వద్ద 15000 టన్నుల సామర్థ్యమున్న పెన్సిలిన్‌ జీ తయారీ యూనిట్‌ నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు వైస్‌ ఛైర్మన్‌ నిత్యానంద రెడ్డి తెలిపారు. ఈ ప్లాంట్‌కు అవసరమైన భూమి సేకరించామని, అలాగే పర్యావరణ అనుమతి కూడా పొందామని ఆయన వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరం నాటికల్లా కాకినాడ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని నిత్యానంద రెడ్డి వెల్లడించారు.