సూపర్ ఫలితాలు: షేర్ డమాల్
గడచిన పది నెలల్లో ఎన్నడూ పడనంతగా ఇవాళ ఏషియన్ పెయింట్స్ షేర్ ఇవాళ నాలుగు శాతంపైగా క్షీణించింది. ఒకవైపు అద్భుత ఫలితాలు ప్రకటించినా… షేర్ ధర ఈ స్థాయిలో పడటం సాధారణ ఇన్వెస్టర్లను ఆశ్చర్య పర్చింది. ఇవాళ ఈ షేర్ రూ. 3350లను తాకి రూ. 3395 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 4.2 శాతం క్షీణించింది. ఈ షేర్ దాదాపు 52 వారాల గరిష్ఠ స్థాయి చేరువ అవుతున్న సమయంలో ఇవాళ లాభాల స్వీకరణ జరిగింది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1550 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 52 శాతం అధికం. అలాగే కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా 7 శాతం పెరిగి రూ. 9182 కోట్లకు చేరింది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ ఏకంగా 36.3 శాతానికి చేరింది. కాని షేర్ ధర ఇవాళ భారీగా క్షీణించడానికి ప్రధాన కారణం… ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడమే. కంపెనీ ఫలితాలను షేర్ ఇప్పటికే డిస్కౌంట్ చేసింది. దీంతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర పెరుగుతోంది. దీంతో చాలా మంది రీ ఎంట్రీ కోసం ఈ కౌంటర్ నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది.