అప్పుల కుప్ప … రూ.4.39 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ కాస్త రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. కేవలం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర అప్పులు, గ్యారంటీలు వెరశి రూ. 5.5 లక్షల కోట్లను దాటాయి. ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో చూపిన గణాంకాల ప్రకారం చూస్తే… అప్పులు, గ్యారంటీలు దాదాపు రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సీఎం కాక ముందు రాష్ట్రం అప్పులు అంటే 2018-19లో రూ.2,57,509 కోట్లు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 22-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ అప్పులు రూ.4,39,394 కోట్లకు చేరుతాయి. 2020-21లో అంటే కరోనా ఏడాదిలో రూ. 69,415 కోట్లను ఓపెన్ మార్కెట్‌తో పాటు వివిధ రుణాల రూపంలో తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో రూ.52,582 కోట్ల రుణం తెస్తానని పేర్కొంది…కాని సవరించిన బడ్జెట్ లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రం ఇప్పటికే రూ.55,723 కోట్ల అప్పులు చేసింది. 2022-23లో ఆర్థిక సంవత్సరంలో మరో రూ.65,000 కోట్ల రుణం తెస్తానని అంటోంది. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచే రూ. 55,000 కోట్ల రుణం తెస్తానని అంటోంది. ఇప్పటి వరకు కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని… అప్పులు తీసుకు రావాల్సి వచ్చిందని చెప్పిన ప్రభుత్వం మళ్ళీ రూ. 65,000కోట్లకు పైగా రుణం దేనికి తెస్తున్నట్లు? చంద్రబాబు ప్రభుత్వం అధికారం నుంచి దిగే ముందు రాష్ట్ర జీఎస్డీపీలో రాష్ట్ర అప్పులు 28 శాతం ఉండగా.. ఇపుడు 32 శాతాన్ని దాటుతున్నాయి.
గ్యారంటీలు కూడా..
విద్యుత్‌తో పాటు వివిధ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు కూడా డబుల్ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయిన 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం రూ. 55,508 కోట్లు. ఇది ఆయా సంస్థల రెవెన్యూ వసూళ్ళలో 48.41 శాతానికి సమానం. రెండేళ్ళలో అంటే 2020-21 ఏడాదిలో ఈ గ్యారంటీల మొత్తం రూ.1,08,936 కోట్లకు చేరింది. ఇది ఆయా సంస్థల రెవెన్యూ వసూళ్ళలో 93 శాతానికి సమానం. 2021 డిసెంబర్ నాటికి ఈ గ్యారంటీల మొత్తం మరింత పెరిగి రూ.1,17,503 కోట్లకు చేరింది. అంటే రాష్ట్రం తెచ్చిన అప్పులు, ఇచ్చిన గ్యారంటీలు కలిపితే రూ.5.5 లక్షల కోట్లు దాటిందన్నమాట. విచిత్రమేమిటంటే… రాష్ట్రం తెచ్చిన రూ.4.39 లక్షల కోట్లలో రూ. 3.08 లక్షల కోట్లు ఓపెన్ మార్కెట్లో తెచ్చిన రుణాలు. అంటే భారీ వడ్డీ చెల్లించక తప్పదన్నమాట. గత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల వరకు అంటే 10 నెలలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 17,656 కోట్లు వడ్డీ కింద చెల్లినట్లు కాగ్ పేర్కొంది. ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పత్రాల ప్రకారం పూర్తి ఏడాదికి రూ.21,996 కోట్లు వడ్డీ కింద చెల్లించనుంది. 2022-23లో కూడా రూ.21,340 కోట్ల వడ్డీ కింద చెల్లించాల్సి ఉంటుందని బడ్జెట్లో పేర్కొన్నారు. బడ్జెట్లో అనేక ప్రధాన శాఖలకు కేటాయింపుల కంటే వడ్డీలకు అధిక మొత్తం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.