For Money

Business News

పెట్టుబడులే రేపటి కేబినెట్‌ అజెండా

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత అత్యంత కీలక కేబినెట్‌ సమావేశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు రేపు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త విధానానికి ఆయన శ్రీకారం చుడుతున్నారు. భారీ పెట్టుబడుదారులే గాక… చిన్న మధ్య తరగతి పరిశ్రమల కోసం కూడా ఆయన ఓ ప్రత్యేక పారిశ్రామిక పెట్టుబడుల విధానాన్ని తీసుకు వస్తున్నారు. రేపు రేపు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో జరిగే కేబినెట్‌ సమావేశంలో పలు పెట్టుబడి పాలసీల గురించి చర్చ జరుగనుంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని తిరిగి పరుగులు పెట్టించేందుకు పలు కీలక నిర్ణయాలను కేబినెట్‌ తీసుకోనుంది. ఎన్నికల్లో ప్రకటించినట్లుగా అయిదేళ్ళలో 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాథి అవకాశాలు కల్పించేలా కొత్త విధానాలు ఉండేలా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. గడచిన మూడు నెలలుగా కొత్త పాలసీలపై ఆయన విస్తృత కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఆయన నిర్దేశించిన లక్ష్యాలే టార్గెట్‌గా కొత్త పాలసీలను అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే దాదాపు 10 శాఖల్లో నూతన విధానాలను అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా వీటిని రూపొందించినట్లు సమాచారం. ఉద్యోగ కల్పనే ప్రధాన లక్ష్యం అనే ప్రధాన లక్ష్యంతో ఈ పాలసీలు సిద్ధమయ్యాయి. రేపటి కేబినెట్‌ సమావేశంలో అయిదారు నూతన పాలసీలపై చర్చిచే అవకాశముంది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్‌ పాలసీలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముందుగా పెట్టుబడులు పెట్టిన వారికి అదనంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు సీఎంఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10 శాతం ప్రోత్సాహకం ఇచ్చేలా ఇండస్ట్రియల్ పాలసీని సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే ‘ఒక కుటుంబం…ఒక పారిశ్రామికవేత్త’అనే కాన్సెప్ట్‌తో ఎంఎస్ఎంఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. అలాగే విద్యుత్ రంగంలో దేశంలోనే అగ్రగామి గా ఉండేలా క్లీన్ ఎనర్జీ పాలసీని రాష్ట్ర అధికారులు సిద్ధం చేశారు.

Leave a Reply