దుమ్మురేపిన ఎయిర్‌టెల్

డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ పనితీరు మార్కెట్ అంచనాలను మించింది. ఈ ముగిసిన త్రైమాసికంలో రూ.14,781 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాద ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ. 3593 కోట్లు. కంపెనీ నికర లాభం రెట్టింపు అవుతుందని మార్కెట్ అంచనా వేసింది. ఇండస్ టవర్ డీల్ కారణంగా కంపెనీకి ఈ త్రైమాసికంలో రూ. 7,545 కోట్ల లాభం వచ్చింది. దీంతో ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం అనూహ్యంగా పెరిగింది. కంపెనీ ఆదాయం మాత్రం 8.8 శాతం పెరిగి రూ. 41,475 కోట్ల నుంచి రూ. 45,129 కోట్లకు పెరిగింది. అలాగే కంపెనీ మార్జిన్ కూడా 52.7 శాతం నుంచి 54.5 శాతానికి పెరిగింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) ఏకంగా రూ.245కి పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.233గా ఉండేది. డిసెంబర్ త్రైమాసికం నాటికి భారతీ ఎయిర్‌టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 57.5 కోట్లకు చేరగా.. ఇందులో భారత కస్టమర్ల సంఖ్య 41.4 కోట్లని కంపెనీ పేర్కొంది.