కుప్ప కూలిన వాల్‌స్ట్రీట్
నిన్నటి లాభాలు ఒక రోజు ముచ్చటగానే మిగిలిపోయాయి. మార్కెట్లో కన్పించిన ఆ కాస్త ఆనందం ఆవిరైపోయింది. ఇప్పటి వరకు అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరిగినపుడు మార్కెట్ భారీగా పడేది. ఇపుడు బాండ్ ఈల్డ్స్ భారీగా క్షీణిస్తున్నా మార్కెట్‌ను ఆదుకునే నాథుడు లేడు. కరోనా సమయంలో భారీ లాభాలు ప్రకటించిన టెక్, ఐటీ కంపెనీలు మళ్ళీ పాత నంబర్లకు వచ్చేస్తున్నాయి. దీంతో అమ్మకాలు పెరుగుతున్నాయి. తాజా సమాచారం మేరకు నాస్డాక్ 2.7 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.7 శాతం, డౌజోన్స్ 1.23 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఎలాన్ మాస్క్ కొంటున్నాడని పెరిగిన ట్విటర్ షేర్ ఇవాళ మూడు శాతం క్షీణించింది. ట్విటర్ కొంటున్నాడని గత కొన్ని రోజులుగా క్షీణిస్తున్న టెస్లా.. ఇవాళ మళ్ళీ 7 శాతం క్షీణించింది. మార్కెట్ తరవాత మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ రెండు కంపెనీల షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. ఆల్ఫాబెట్ మూడు శాతం నష్టంతో, మైక్రోసాఫ్ట్ 2.5 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ అమ్మకాల హోరు చూస్తుంటే సూచీలు కోలుకోవడం కష్టంగానే కన్పిస్తోంది.