అడ్వెంట్ చేతికి ఆవ్రా లాబ్స్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆవ్రా లేబొరేటరీస్‌లో మెజారిటీ వాటాను చేజిక్కించుకున్నట్లు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. దాదాపు 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.750 కోట్లు)కు ఈ వాటాను దక్కించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆవ్రా లాబ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అడ్వెంట్ పేర్కొంది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త ఏవీ రామారావు.. 1995లో ఆవ్రా లేబొరేటరీస్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ కంపెనీ క్రాంటాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ సర్వీసెస్ (క్రామ్స్), స్పెషాలిటీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్స్ (ఏపీఐ)లో కార్యకలాపాలు సాగిస్తోంది. కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో నాలుగు ప్లాంట్లు ఉన్నాయి. అలాగే అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలకు పరిశోధనా సేవలు అందించడంతో పాటు కొత్త జనరిక్ మాలిక్యూల్స్‌ను, కస్టమ్ సింథసిస్ సేవలను ఆవ్రా ల్యాబ్స్ అందిస్తోంది. అడ్వెంట్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంతో తాము ప్రపంచ మార్కెట్‌లో ఇంకా విస్తరించే అవకాశం ఏర్పడిందని డాక్టర్ ఏవీ రామారావు వెల్లడించారు.