అదానీ విల్మర్: ఫలితాలు నిరుత్సాహం
మార్చితో ముగిసిన త్రైమాసికంలో అదానీ గ్రూప్ తాజా కంపెనీ అదానీ విల్మర్ నిరుత్సాహకర పనితీరు కనబర్చింది. అంతర్జాతీయంగా వంటనూనెల ధరలు భారీగా పెరగడంతోపాటు అధిక పన్ను చెల్లింపుల కారణంగా కంపెని నికర లాభం తగ్గింది. గత ఏడాదితో ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ టర్నోవర్ 40 శాతం పెరిగి రూ. 14,960 కోట్లకు చేరింది. అయితే కన్సాలిడేటెడ్ నికర లాభం 25.6 శాతం క్షీణించి రూ.234.3 కోట్లకు పడిపోయింది. తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఇంకా ఇతర వృద్ధి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ఆంగ్షు మాలిక్ తెలిపారు. తాను ఉన్న రంగంలోనే వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదానీ, సింగపూర్‌కు చెందిన విల్మర్లు సమాన వాటా అదానీ విల్మర్‌ను నెలకొల్పిన విషయం తెలిసిందే. ఇవాళ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో అదానీ విల్మర్ షేర్ 3.43 శాతం నష్టంతో రూ. 753.60 వద్ద ముగిసింది.