జగన్-అదానీ అవినీతి కేసు క్లోజ్?

బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ ప్రచురించిన ఓ వార్త కథనం తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. జగన్ సీఎంగా ఉన్నసమయంలో ఆయనను ఇరకాటంలో పడేసిన అదానీ ముడిపుల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సౌర విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు సుమారు రూ. 1,750 కోట్ల మేరకు ముడపులు జగన్ తీసుకుని ఉండొచ్చని, అవి అదానీ గ్రూప్ నుంచే వచ్చినట్లు అనుమానిస్తూ అమెరికా న్యాయ విభాగం గత ఏడాది కేసు నమోదు చేసింది. అలాగే సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (సీఈసీ) కూడా విడిగా కేసు నమోదు చేసింది. జగన్ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఈ కేసు కూడా ఓ ప్రధాన కారణంగా రాజకీయ నిపుణులు చెబుతుంటారు. అలాంటి కేసు ఇపుడు కీలక మలుపు తీసుకుంది. గతవారం తాము జరిగిన స్వతంత్ర దర్యాప్తులో అదానీ ఎనర్జి ఎలాంటి తప్పు చేయలేదని తేలిందని అదానీ గ్రూప్ తెలిపింది. ఇపుడు అమెరికాలో కేసు మూసివేసేందుకు అదానీ గ్రూప్ నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ రాసింది. ట్రంప్ ఇపుడు అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ రాజకీయాలకు అనుగుణంగా అదానీ కేసు లేదని చెబుతోంది. పారశ్రామిక వేత్తలకు అగ్రతాంబూలం వేసే ట్రంప్‌తో ఇదే విషయం చెప్పాల్సిందిగా ట్రంప్ అనుచరులతో అదానీ వర్గాలు అన్నట్లు బ్లూమ్‌బర్గ్ రాసింది. ఈ చర్చలు శరవేగంతో జరుగుతున్నాయని… రానున్న నెల రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని కూడా ఆ వార్తా సంస్థ రాసింది. ఇదే నిజమైతే జగన్-అదానీ ముడుపుల కేసు ముగిసినట్లు.