మొత్తం సిమెంట్ షేర్లను తాకట్టు పెట్టారు
ఇటీవల హోల్సిమ్ కంపెనీ నుంచి గుజరాత్ అంబుజా, ఏసీసీ కంపెనీలలో మెజారిటీ షేర్లను అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 1300 కోట్ల డాలర్లను (సుమారు రూ. లక్ష కోట్లు) వెచ్చించి ఈ షేర్లను కొనుగోలు చేశారు. ఈ డీల్ ద్వారా ఏసీసీలో 57 శాతం, అంబుజా సిమెంట్‌లో 63 శాతం వాటా గౌతమ్ అదానీ చేతికి వచ్చింది. తాజా వార్త ఏమిటంటే…ఈ షేర్లన్నింటిని అదానీ గ్రూప్ తాకట్టు పెట్టింది. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అదానీ గ్రూప్ ఈ షేర్లను తాకట్టు పెట్టి నిధులు తీసుకున్నట్లు డాయిష్ బ్యాంక్ ఏజీ హాంగ్ కాంగ్ శాఖ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. గ్రీన్ ఎనర్జి నుంచి మీడియా రంగాల్లోకి విస్తరిస్తున్న ఈ గ్రూప్ ఈ స్థాయిలో రుణాలు ఇవ్వడంపై ఇపుడు స్టాక్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏసీసీ, అంబుజా సిమెంట్ కంపెనీలో చెరో 26 శాతం వాటా కోసం అదానీ ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. అదానీ ఆఫర్ చేసిన ధరకన్నా… మార్కెట్లో ధర అధికంగా ఉండటంతో పెద్దగా స్పందన రాలేదు. దీంతో ఓపెన్ ఆఫర్ కోసం పెద్దగా నిధులు పెట్టాల్సిన అవసరం అదానీలకు రాలేదు. మరి తాజాగా 1300 కోట్ల డాలర్లు అంటే లక్ష కోట్ల రూపాయల విలువైన షేర్లను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని అదానీ ఏం చేయనున్నట్లు?