అదానీ చేతికి ఏసీసీ, అంబుజా సిమెంట్?
భారత్‌లోని తన సిమెంట్ కంపెనీలను విక్రయిస్తానని స్విట్జర్ల్యాండ్కు చెందిన హోలిసిమ్ లిమిటెడ్ ప్రకటించిన వెంటనే… ఆ ఆస్తుల కోసం పలు భారత కంపెనీలు ప్రయత్నిస్తున్నారు. హోలిసిమ్‌కు భారత్‌లో రెండు సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. అంబుజా సిమెంట్ హోల్డింగ్ కంపెనీ కాగా, దాని అనుబంధ కంపెనీగా ఏసీసీ ఉంది. ఈ రెండు కంపెనీలు స్థాపక వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.6 కోట్ల టన్నులు. వీటిని టేకోవర్ చేసేందుకు అదానీ గ్రూప్ కూడా ప్రయత్నిస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే అదానీ గ్రూప్ ముందంజలో ఉంది. ఈ టేకోవర్ కోసం దాదాపు 1000 కోట్ల డాలర్లు అంటే రూ. 77,000 కోట్లు అవసరమౌతాయి. ఈ మొత్తం నిధులు సమీకరణకు అదానీ గ్రూప్ ఏర్పాట్లు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ బ్యాంకులైన బార్కలేస్, డాయిష్ బ్యాంకులతో పాటు భారత్‌కు చెందిన ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు నిధుల సమీకరణకు అదానీ గ్రూప్‌నకు సాయం చేస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పత్రిక రాసింది. ఇప్పటికే హోలిసిమ్తో అదానీ గ్రూప్ చర్చలు ప్రారంభించిందని… చర్చలు తుది దశలో ఉన్నాయని సమాచారం. హోల్సిమ్కు అంబుజా సిమెంట్‌లో 63.1 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ 9.6 బిలియన్ డాలర్లు. అలాగే మరో కంపెనీ ఏసీసీ సిమెంట్‌లో గుజరాత్ అంబుజాకు 50.05 శాతం వాటా ఉంది. నాన్ కోర్ అసెట్స్‌ను విక్రయించాలని హోలిసిమ్ నిర్ణయించింది. దీంతో ఈ రెండు కంపెనీలను విక్రయానికి పెట్టింది. ఈ డీల్ కుదిరితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి అనుమతి కూడా పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌కే అనుకూల వాతావరణం ఉన్నట్లు తెలుస్తోంది.