For Money

Business News

అదానీ చేతికి ఏసీసీ, అంబుజా సిమెంట్‌

ఊహించినట్లే ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కంపెనీలు అదానీ గ్రూప్‌ చేతికి చేరాయి. ఈ డీల్‌కు సంబంధించి అదానీ గ్రూప్‌ పత్రికా ప్రకటన జారీ చేసింది. గుజరాత్‌ అంబుజా ఈక్విటీలో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ లిమిటెడ్‌కు ఉన్న మెజారిటీ వాటాను అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌తో కలిపి 1,050 కోట్ల డాలర్లకు (సుమారు రూ.81,360 కోట్లు) కొనుగోలు చేసింది. ఏసీసీలో మెజారిటీ వాటా గుజరాత్‌ అంబుజాకు ఉన్నందున… ఈ టేకోవర్‌తో ఆ కంపెనీకి కూడా అదానీ చేతికి వచ్చేసింది. భారత కార్పొరేట్‌ రంగంలో ఇది అతి పెద్ద టేకోవర్‌ చోటు చేసుకుంది. భారత సిమెంట్‌ రంగంలోనే కాకుండా భారత కార్పొరేట్‌ రంగంలోనే దీన్ని అతిపెద్ద కొనుగోలుగా భావిస్తున్నారు. హోల్సిమ్‌ కంపెనీకి అంబుజా సిమెంట్‌ ఈక్విటీలో 63.19 శాతం ఉండగా, ఏసీసీ ఈక్విటీలో 54.53 శాతం వాటా ఉంది.
ఓపెన్‌ ఆఫర్‌ డీల్‌
డీల్‌ ఖాయమైనందున మిగిలిన వాటాదారుల నుంచి 26 శాతం వాటా కోసం అదానీ గ్రూప్‌ త్వరలో ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. ఒక్కో అంబుజా సిమెంట్‌ ఈక్విటీ షేరును రూ.385, ఏసీసీ షేరును రూ.2,300 చొప్పున అదానీ గ్రూప్‌ కొనుగోలు చేస్తోందని హోల్సిమ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్‌ రంగంలోకి ప్రవేశించేందుకు అదానీ గ్రూప్‌ ఈ మధ్యనే అదానీ సిమెంట్‌ లిమిటెడ్‌ పేరుతో 2021లోనే ఓ కంపెనీని కూడా ఏర్పాటు చేసింది. జిందాల్‌, అల్ట్రాటెక్‌ కంపెనీలు కూడా
ఏసీసీ, అంబుజా సిమెంట్‌లో హోల్సిమ్‌ వాటా కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డాయి. అత్యధిక ధర కోట్‌ చేయడం ద్వారా అదానీ గ్రూప్‌ ఈ రెండు సిమెంట్‌ కంపెనీలను కైవసం చేసుకుంది. ఈ కొనుగోలుతో దేశ సిమెంట్‌ ఉత్పత్తిలో అదానీ గ్రూప్‌ రెండో అతిపెద్ద గ్రూప్‌ కానుంది. ప్రస్తుతం ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కంపెనీల వార్షిక సిమెంట్‌ ఉత్పత్తి సామర్ధ్యం 6.6 కోట్ల టన్నులు. అల్‌ట్రాటెక్‌ కు తప్ప మరే కంపెనీకి ఇంత ఉత్పత్తి సామర్ధ్యం లేదు. ఏసీసీ కంపెనీకి దేశవ్యాప్తంగా 17 సిమెంట్‌ తయారీ యూనిట్లు, సొంత విద్యుత్‌ అవసరాల కోసం తొమ్మిది విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. ఇక అంబుజా సిమెంట్‌ 3.1 కోట్ల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ద్యంతో ఆరు సిమెంట్‌ తయారీ యూనిట్లు, ఎనిమిది సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్లు నడుపుతోంది.