42% పెరిగిన కిమ్స్ లాభం
మార్చితో ముగిసిన మూడు నెలలకు కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) రూ.83.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.58.6 కోట్లతో పోలిస్తే 42 శాతం పెరిగింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.362.7 కోట్ల నుంచి రూ.380.5 కోట్లకు చేరింది. మొత్తం ఏడాదికి రూ.1,671 కోట్ల ఆదాయంపై రూ.344 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు కిమ్స్ ఎండీ బీ భాస్కరరావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం కొవిడ్ వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఈపీఎస్ రూ. 41.88గా నమోదైంది. కొత్తగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సలు, ఆధునాత గ్యాస్ట్రోఎంటరాలజీ ఆపరేషన్లు, కాలేయ మార్పడి చికిత్సలు చేయడం మొదలు పెట్టినట్లు భాస్కరరావు వెల్లడించారు.