రుచి సోయా మాయం.. ఇక అంతా పతంజలి
చిత్రం.. టేకోవర్ చేసిన కంపెనీ మాయమౌతోంది. అమ్ముడుబోయిన కంపెనీ నిలబడబోతోంది. పతంజలి ఆయుర్వేదకు చెందిన ఆహార పదార్థాల వ్యాపారాన్ని, ఆస్తులను గంపగుత్తగా రుచి సోయా కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందం విలువ రూ. 690 కోట్లు. ప్రస్తుతం పతంజలి పేరిట ఉన్న నెయ్యి, తేనె, మసాలాలు, పండ్ల రసాలు, గోధుమ పిండి సహా మొత్తం 21 ఉత్పత్తులు రుచిసోయా సొంతం కానున్నాయి. అలాగే పదార్థ, హరిద్వార్‌తో పాటు మహారాష్ట్రాలోని నెవాసాలోని పతంజలి ప్లాంట్లను రుచి సోయా కోనుగోలు చేసింది. మే 9 నుంచి పూర్తిగా ఆహార పదార్థాల వ్యాపారాన్ని రుచి సోయాకు బదిలీ చేసేందుకు పతంజలి బోర్డు కూడా ఆమోదం తెలిపింది. జులై 15 నాటికి మొత్తం మూడు విడతల్లో పతంజలికి చెల్లింపులు చేయనున్నట్లు రుచిసోయా తెలిపింది. ఈ టేకోవర్ పూర్తయిన తరవాత కంపెనీ పేరును రుచి సోయా నుంచి పతంజలి ఫుడ్స్‌గా మారనుంది. అంటే రుచిసోయా మాయం కానుంది. ఈ డీల్ తరవాత రుచిసోయా కంపెనీ షేర్ పది శాతం అప్పర్ సీలింగ్‌తో రూ.1192 వద్ద ముగిసింది.