అమెరికాలో మాంద్యం?
ద్రవ్యోల్బణం అదుపు కోసం అమెరికా ఫెడరల్ రిజర్వ్ జెట్ స్పీడ్తో వడ్డీ రేట్లను పెంచుతోంది. దీంతో దేశ వద్ధి రేటు తగ్గుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా మరోసారి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నట్టు గోల్డ్మన్ శాక్స్ సీనియర్ చైర్మన్ లాయిడ్ బ్లాంక్ఫీన్ హెచ్చరించారు. సీబీఎస్ టీవీ నిర్వహించిన ‘ఫేస్ ది నేషన్’ కార్యక్రమంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. కంపెనీలు, వినియోగదారులు కూడా ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా బ్లాంక్ఫీన్ స్పష్టం చేశారు. కొవిడ్ రాకముందే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగించిందని, వడ్డీ రేట్లు దాదాపు జీరో స్థాయికి తగ్గించడం ద్వారా ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ వచ్చిందని ఆయన అన్నారు. కరోనా సమయంలో అమెరికా భారీ ఎత్తున నోట్లను ముద్రించింది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న సమయంలో భారీ ఎత్తున ఆర్థిక సాయం అందించింది. దీంతో ఇప్పుడు అమెరికాలో ధరల భారీగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. దీన్ని ఎదుర్కొనేందుకు ఫెడ్ రిజర్వ్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఒకేసారి కీలక వడ్డీ రేటు అర శాతం పెంచేసింది.ఈ ఏడాది చివరికి మరో ఒక శాతం వరకు పెంచే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలిచ్చింది.