ఈ ముద్ర పబ్లిక్ ఆఫర్ 20న
దేశంలో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ప్రొవైడర్లలో అగ్రస్థానంలో ఉన్న ఈ ముద్ర లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ ఈనెల 20న ప్రారంభం కానుంది. 24వ తేదీన ముగుస్తుంది. ఈ ఇష్యూ ధరల శ్రేణిని రూ.243-256గా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి మే 19 నుంచే బిడ్లను స్వీకరిస్తారు. తాజా షేర్ల జారీ ద్వారా రూ.161 కోట్ల విలువైన షేర్లను, ఆఫర్ సేల్ కింద మరో 98.35 లక్షల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. గరిష్ఠ ధర వద్ద షేర్లను కేటాయించే పక్షంలో ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 412.79 కోట్లు సమకూర్చుకోనుంది. ఉన్న అప్పులను తీర్చడం, మూలధన అవసరాలతో పాటు, డేటా సెంటర్ల స్థాపనకు కావాల్సిన పరికరాల కొనుగోళ్ళ కోసం ఇష్యూ నిధులను వినియోగిస్తారు. పబ్లిక్ ఇష్యూ పరిమాణంలో సగం షేర్లను అర్హతగల వ్యవస్థాపక ఇన్వెస్టర్లకు, 35 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తున్నారు. మిగిలిన 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు. దేశీయ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్స్ రంగంలో ఈ కంపెనీ మార్కెట్ వాటా 37.9 శాతం.