మార్కెట్‌పై సడలని బేర్ పట్టు
16800 నుంచి మార్కెట్‌ను షార్ట్ చేస్తున్నారు బేర్ ఆపరేటర్లు. అసలు పుట్స్ రైటింగ్‌కు ఓ స్థాయి లేకుండా మార్కెట్ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతుంది. నిన్నటి దాకా 16000 -16200 మధ్య పుట్ రైటింగ్ జరిగేది. ఇపుడు 15500 వద్ద కూడా పుట్ రైటింగ్ జరుగుతోంది. అంటే మార్కెట్ పతనం ఎక్కడిదాకా అన్న అంచనా చాలా మంది అంచనా వేయలేకపోతున్నారు. ఇపుడు భారీగా కాల్ రైటింగ్ 16000 వద్ద జరుగుతోందనే అనాలి. సింగపూర్ నిఫ్టి 150 పాయింట్లు నష్టంలో ఉండేసరికి… చాలా మంది ఓపెనింగ్ చూసి మార్కెట్ కోలుకుంటుదని అనుకున్నారు. ముఖ్యంగా 16000 ఉన్నపుడు. తరవాత 15900 వద్ద కోలుకుంటుందని భావించారు. కాని అసలు దెబ్బ యూరో మార్కెట్లు వేశాయి. ఒకేసారి రెండు శాతం వరకు నష్టాలతో యూరో మార్కెట్లు ప్రారంభమయ్యే సరికి భారత మార్కెట్లో భయం ప్రారంభమైంది. వడ్డీ రేట్లను అనుకున్న షెడ్యూల్ కంటే ముందే పెంచుతారన్న వార్తలతో మార్కెట్లో అమ్మకాలు భారీగా పెరిగాయి. నిఫ్టి ఒకదశలో 15735కి పడింది. క్లోజింగ్ సమయంలో స్వల్పంగా కోలుకుని 15808 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 359 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఇక సెన్సెక్స్ 1158 పాయింట్లు క్షీణించింది. నిఫ్టి ఇక తక్షణ సపోర్ట్ 15450 ప్రాంతంలో ఉందని కొందరు అనలిస్టులు అంటున్నారు. నిన్న వచ్చిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ ప్రపంచ మార్కెట్లను వణికించింది. ఇపుడు కూడా అమెరికా ఫ్యూచర్స్ అరశాతంపైగా నష్టంతో ఉన్నాయి. ఇవాళ కూడా వాల్‌స్ట్రీట్‌లో నష్టాలు తప్పేలా లేదు. నిఫ్టిలో గ్రీన్‌లో ఉన్న చాలా వరకు షేర్లు ఐటీ రంగానివి. అవి కూడా నామ మాత్రంగా స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఇక నిఫ్టి టాప్ లూజర్స్‌లో అదానీ పోర్ట్స్ ముందుంది. ఈ షేర్ ఇవాళ ఆరు శాతం దాకా క్షీణించింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, మెటల్స్ భారీగా దెబ్బతిన్నాయి. ఇక సూచీల విషయానికొస్తే అత్యధికంగా 3.35 శాతం నష్టంతో నిఫ్టి బ్యాంక్ ఉంది. తరవాత నిఫ్టి మిడ్ క్యాప్ 2.68 శాతం నష్టంతో ముగిసింది.