డెలివరీకి సబ్స్క్రయిబ్ చేయొచ్చా?
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న లాజిస్టిక్ కంపెనీ డెలివరీ పబ్లిక్ ఇష్యూ ఇవాళ ప్రారంభమైంది . మే 13న ముగుస్తుంది. రూ.5,235 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వచ్చిన పెద్ద ఇష్యూ ఇది. రూ .4,000 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు రూ.1,235 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదార్లు అమ్ముతున్నారు. ఇష్యూ ధరల శ్రేణి రూ . 462-రూ.487 కాగా కనీసం 30 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మే 24 ఈ షేర్లు ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి. ఇ – కామర్స్ లాజిస్టిక్స్ సంస్థ అయిన డెలివరీ .. దేశవ్యాప్తంగా మొత్తం 17,045 పిన్‌కోడ్ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తోంది. ఎఫ్ఎంసీజీ, ఎంఎస్ఎంఈ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్, లైఫ్ స్టైల్, రిటైల్, ఆటోమోటివ్, తయారీ .. ఇలా వివిధ రంగాల్లో మొత్తం 21,342 సంస్థలకు లాజిస్టిక్స్ సేవలు అందిస్తోంది. పలు ప్రముఖ కంపెనీలు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాయి. గతంలో ఈ షేర్‌ను రూ. 960కు ఆఫర్ చేయాలనకున్నారు. కాని మార్కెట్ పరిస్థితి బాగా లేనందున.. తక్కువ ధరకు ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ ధర వద్ద కొనుగోలు చేయొచ్చా అన్న అనుమానం చాలా మంది ఇన్వెస్టర్లలో ఉంది. బ్రోకింగ్ సంస్థలు సిఫారసు చేస్తున్నా… ఇటీవల లిస్టయిన పలు కంపెనీల షేర్లు లిస్టింగ్ రోజున బోల్తా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. లిస్టింగ్ లాభాలకన్నా దీర్ఘకాలిక పెట్టుబడి కోసం దరఖాస్తు చేయొచ్చని పలువురు అనలిస్టులు సలహా ఇస్తున్నారు.