గనుల లీజు వ్యవహారం: చిక్కుల్లో హేమంత్ సోరేన్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ కొత్త చిక్కుల్లో పడ్డారు. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 9A కింద ఎమ్మెల్యేగా హేమంత్ సోరేన్‌పై అనర్హత వేటు వేసే అంశాన్ని ప్రధాన ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. వచ్చే వారం హేమంత్ సోరేన్‌కు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. 2021 జూన్‌లో సోరేన్‌కు చెంది సంస్థకు జార్ఖండ్ ప్రభుత్వం గనుల లీజు ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రతిపక్షం 500పేజీల డాక్యుమెంట్లను ప్రధాన ఎన్నికల సంఘానికి సమర్పించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9A ప్రకారం ప్రభుత్వానికి వస్తువులు లేదా ఏదైనా పనులకు సంబంధించిన కాంట్రాక్టులు ప్రజా ప్రతినిధి తీసుకుంటే.. అతనిపై అనర్హత వేటు వేయొచ్చు. ఇదే క్లాజు కింద సోరేన్ కంపెనీకి ఇచ్చిన లీజు వస్తుందా లేదా అన్న అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. గనులు, ఖనిజాల తవ్వకాన్ని లీజుకు ఇచ్చినపుడు రెవెన్యూ షేరింగ్ ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ కిందకు వస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సెక్షన్ 9A కిందకు ఈ వ్యవహారం వస్తుందని ప్రధాన ఎన్నికల సంఘం భావిస్తే… వచ్చే వారం హేమంత్ సోరేన్‌కు నోటీసు జారీ చేసే అవకాశముంది. ప్రభుత్వం తరఫున, విపక్షం తరఫున అనేక మంది సీనియర్ లాయర్లు ఎన్నికల సంఘం ముందు తమ వాదనలు వినిపించారు.ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుని.. ఇదే అంశాన్ని గవర్నర్‌కు ఎన్నికల సంఘం తెలియజేస్తుంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునేముందు హేమంత్ సోరేన్‌కు ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చే అవకాశముంది. ఇదే అంశంపై హైకోర్టులో కొందరు సవాలు చేశారు. ఇది అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని వాదించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్… పొరపాటున సీఎంకు కేటాయించారని, వెంటనే దాన్ని రద్దు చేశామని కోర్టు దృష్టికి తెలిపారు. అయినా కోర్టు ఏప్రిల్ 8వ తేదీన నోటీసు జారీ చేసింది.