ఎలాన్ మస్క్ ఆఫర్‌కు ట్విటర్ ఓకే?
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఆఫర్‌కు ట్విటర్ బోర్డు ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఒక్కో షేరును 54.20 డాలర్ల చొప్పున మొత్తం షేర్లు కొనుగోలు చేస్తానని ఎలాన్ మస్క్ ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ట్విటర్ బోర్డు సమావేశం కానుంది. మస్క్ ఆఫర్‌ను తాము ఆమోదిస్తున్నామని… వాటాదారులకు బోర్డు తెలుపనుంది. అయితే ఈ ఒప్పందంలో ట్విటర్ ఓ కండిషన్ పెట్టే అవకాశముంది. మస్క్‌తో డీల్ కుదిరిన తరవాత మరో పార్టీ గనుక అంతకన్నా ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తే… మస్క్‌కు ‘బ్రేకప్’ ఫీజుల చెల్లించి సదరు ఒప్పందం నుంచి ట్విటర్ బయటపడొచ్చు. కాని ఆ కండీషన్ విషయంలో ట్విటర్ తుది నిర్ణయానికి రాలేదని రాయిటర్స్ అంటోంది. పైగా ఇతర డీల్స్ మాదిరి ఈ డీల్ కూడా చివరి నిమిషంలో విఫలం కావొచ్చని పేర్కొంది. దీనికి సంబంధించి స్పందించేందుకు ట్విటర్, ఎలాన్ మస్క్ నిరాకరించినట్లు రాయిటర్స్ వెల్లడించింది.