షేర్ మార్కెట్ ఎందుకు పడుతోంది…
ఇవాళ కూడా స్టాక్ మార్కెట్ భారీగా క్షీణించింది. నిన్న కూడా అనేక షేర్లు కుప్పకూలాయి. ముఖ్యంగా ఐటీ. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా కూడా. మార్కెట్ ఎందుకు ఇలా పడింది? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఆర్థిక అంశాలపై అవగాహన ఉందో లేదో గాని స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మాత్రం ఖచ్చితంగా ఉంది. ద్రవ్యోల్బణం నాలుగు శాతం ఉంటుందని.. రెండు శాతం అటూ లేదా ఇటూ అని గత క్రెడిట్ పాలసీ సమయంలో అన్నారు. నాలుగు అనుకుంటున్నాం.. అది 2 కావొచ్చు లేదా ఆరు కావొచ్చని. ఇదేం లెక్క అని అపుడు బిజినెస్ జర్నలిస్టులు కంగుతిన్నారు. టోకు ధరలు కాదు.. రీటైల్ ధరల సూచీ 6.5 శాతానికి చేరినా ఈ నెలలో జరిగిన క్రెడిట్ పాలసీలో కూడా వడ్డీ రేట్లు తగ్గించలేదు. కాని మార్కెట్లో ఏం జరుగుతోందో కంపెనీలకు.. ఇన్వెస్టర్లకు తెలుసు. అమెరికా వచ్చే నెలలో అర శాతం, ఆ తరవాత ఈ ఏడాదిలో ఒక ఒక శాతం మేర వడ్డీ పెంచనుంది. అంటే ఒకటిన్నర శాతం. అందుకే పదేళ్ళ అమెరికా బాండ్లపై ఈల్డ్స్ 2.9 శాతానికి చేరాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్ల ఇక్కడి నుంచి డబ్బు వెనక్కి తీసుకుంటున్నారు. ఎందుకంటే మున్ముందు భారత కంపెనీల లాభదాయకత మునుపటిలా ఉండదు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా అనేక వస్తువుల ధరలు పెరిగాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు. దీనివల్ల పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయి. ఒక్క డీజిల్ ధర పెరగడంలో దేశంలో టమోట నుంచి ప్రతి వస్తువు ధర పెరుగుతంది. ప్రభుత్వం డిపాజిట్లపై వడ్డీ పెంచడం లేదు. దీంతో శ్రీమంతులకు ఇబ్బంది లేదు కాని… మధ్య, పేద వర్గాలు డిమాండ్ తగ్గించుకుంటారు. దీంతో కంపెనీల వస్తువులకు ఒకవైపు డిమాండ్ తగ్గుతుంది. మరోవైపు ముడి పదార్థాల వ్యయం పెరిగినందున మార్జిన్లు కూడా తగ్గుతాయి. దెబ్బకు కంపెనీ లాభదాయకత దారుణంగా పడిపోతుంది. పెట్టుబడి పెట్టే వారికి నికర వడ్డీని చూస్తారు. అంటే వడ్డీకి, ద్రవ్యోల్బణానికి మధ్య వ్యత్యాసం. డిపాజిట్లపై 5 శాతం వడ్డీ, టోకు ధరల సూచీ 14.5 శాతం ఉంటే… జనం దాదాపు పది శాతం అదనపు భారం పడుతుంది. ధరలు 15 శాతం పెరిగి, డిపాజిట్లపై 5 శాతం మాత్రమే వడ్డీ వస్తే… పరిస్థితి ఇలాగే ఉంటుంది. అమెరికాలో వడ్డీ రేట్లను పెండచంతో ద్రవ్యోల్బణం తగ్గుతంది. అపుడు నికర వడ్డీ పాజిటివ్ అవుతుంది. అందుకే విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. అయితే ఇందులో ఒక తిరకాసు ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకెళుతున్నారా? లేదా లాభాలు స్వీకరిస్తున్నారా? అని… ఎందుకంటే పెట్టుబడులు వెనక్కి పోతే డాలర్ డిమాండ్ మరింత పెరిగి… రూపాయి బక్కచిక్కిపోతుంది. అదే లాభాలు స్వీకరిస్తే… డాలర్ డిమాండ్ అంతగా ఉండదు. ఇవన్నీ చూసే.. ఇన్వెస్టర్లు బయట పడుతున్నారు.