విశాఖ స్టీల్… నష్టాల నుంచి లాభాల్లోకి
విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర సృష్టించింది. కంపెనీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా టర్నోవర్, గ్రాస్ మార్జిన్‌లను సాధించింది. 201-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్టాంట్ రూ. 28,082 కోట్ల టర్నోవర్‌తో కొత్త చరిత్ర సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే టర్నోవర్ 35 శాతం పెరిగినట్లు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ మాతృసంస్థ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ భట్ తెలిపారు. ఇదే కాలంలో కంపెనీ పన్నుల ముందు లాభం రూ. 835 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఆరేళ్ళ తరవాత పన్నుల ముందు లాభాన్ని విశాఖ స్టీల్ ఆర్జించిందన్నారు. కంపెనీ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.3,575 కోట్ల గ్రాస్ మార్జిన్ అంచనా వేస్తున్నట్లు అతుల్ భట్ చెప్పారు. కంపెనీ ఏర్పడినప్పటి నుంచి ఎన్నడూ ఈ స్థాయి గ్రాస్ మార్జిన్ రాలేదన్నారు. ఇదంతా కార్మికులు, అధికారుల ఘనతేనని ఆయన అన్నారు. 57.7 లక్షల టన్నుల హాట్ మెటల్, దాని నుంచి 55.2 లక్షల టన్నుల లిక్విడ్ స్టీల్‌ను తయారు చేసింది విశాఖ స్టీల్. దాని నుంచి 52.7 లక్షల టన్నుల క్రూడ్ స్టీల్ ఉత్పత్తి అయింది. ఆ ఉత్పత్తి నుంచి 51.4 లక్షల టన్నుల సేలబుల్ స్టీల్‌ను ప్లాంట్ ఉత్పత్తి చేసిందని అతుల్ భట్ తెలిపారు. కంపెనీ ఏర్పడిన తరవాత ఈ స్థాయిలో స్టీల్ ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి ఆయన వెల్లడించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద ఈ ప్రాంతంలోని విద్యార్థులకు విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్య అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, స్వచ్ఛ భారత్‌లకు రూ.11 కోట్లు వెచ్చిస్తున్నట్లు అతుల్ భట్ వెల్లడించారు.