For Money

Business News

ఉద్యోగులకు నజరానా… BMW కార్లు

అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ (SaaS) కంపెనీ అయిన కిస్‌ఫ్లో ఇన్‌కార్పొరేటెడ్‌లో శుక్రవారం అనూహ్య ఘటన జరిగింది. ఉద్యోగులందరినీ రమ్మని యజమాని సురేష్‌ సంబంధం కబురు పంపాడు. రేపటి నుంచి సెలవులే కదా? చివర్లో ఈ మీటింగ్‌ ఏమిటి అని ఉద్యోగులు అనుకుంటున్నారు. కొత్త ఇన్వెస్టర్‌ ఎవరైనా కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారా? ఆ విషయం చెప్పేందుకే ఈ మీటింగ్ అని ఉద్యోగులు అనుకున్నారు. వారందరూ వెయిట్‌ చేస్తున్న చోటికి వరుసగా అయిదు BMW కార్లు వచ్చాయి. అయిదు కార్లలో కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్వెస్టర్లు వస్తారంటే వీరు వచ్చారేమిటని.. ముఖ్యంగా కంపెనీ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ దినేష్‌ వరదరాజన్‌, డైరెక్టర్‌ (ప్రొడక్ట్‌ మేనేజ్మెంట్‌) కౌషిక్రమ్‌ కృష్ణసాయి, డైరెక్టర్‌ వివేక్‌ మధురై, డైరెక్టర్‌ ఆది రామనాథన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రసన్న రాజేంద్రన్‌…ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కార్లలో నుంచి దిగింది వారి కుటుంబ సభ్యులే. అపుడు కంపెనీ యజమాని సంబంధం మాట్లాడుతూ… ”తాను కంపెనీ పెట్టినప్పటి నుంచి .. కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా తన వెంటే ఉన్న ఈ అయిదుగురికి కంపెనీ పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు” ప్రకటించారు. ఒక్కోకారు కోటి రూపాయలకు పైగా విలువ చేసే BMW 5 Series కార్లను వారికి ఇచ్చారు. కరోనా సమయంలో తమ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు కూడా అనుమానం వ్యక్తం చేశారని… కాని వీరందరి కృషితో ఇన్వెస్టర్ల సొమ్ము వెనక్కి ఇచ్చేశామని అన్నారు. తమ కంపెనీలో వారానికి ఒక రోజు సెలవు తప్ప… మరో సెలవు ఉండని… ఆఫీసుకు రాలేకపోతే… ఇంటి నుంచే పనిచేయాల్సి ఉంటుందని సంబంధం అన్నారు. తమ కంపెనీ ఎలాంటి అటెండెన్స్‌ రిజిస్టర్లు ఉండవని అన్నారు. అయితే ఉద్యోగుల కష్టానికి తగ్గ ప్రతి ఫలం కచ్చితంగా ఉంటుందని అన్నారు.