గట్టెక్కిన రుచి సోయా ఎఫ్‌పీఓ
బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్ కంపెనీ రుచి సోయా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఎట్టకేలకు గట్టెక్కింది. ఇష్యూ ఆరంభమైన తొలి రెండు రోజుల్లో పెద్దగా స్పందన లేదు. చివరిరోజున నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు భారీగా సబ్‌స్క్రయిబ్ చేయడంతో ఇష్యూ బయటపడింది. రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి మాత్రం పెద్దగా ఆసక్తి రాలేదు. రీటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటాలో 0.9 శాతం షేర్లకు మాత్రమే దరఖాస్తు చేశారు. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన భాగం 2.2 రెట్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటాకు 11.75 రెట్లు స్పందన వచ్చింది. ఇక ఉద్యోగులకు కేటాయించిన షేర్లకు కూడా 7.76 రెట్ల సబ్‌స్క్రిప్షన్ వచ్చింది. చాలా మంది చిన్న చిన్న బ్రోకర్లు ఈ షేర్‌కు మద్దతు తెలిపినా రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి కన్పించలేదు. ఇవాళ కూడా మార్కెట్‌లో రుచి సోయా షేర్ రూ. 815కు అంటే ఆరు శాతంపైగా నష్టంతో ముగిసింది. ఎఫ్‌పీఓ షేర్లు ఏప్రిల్ 6న లిస్టవుతాయి. ఈలోగా రుచి సోయా షేర్ మరింత క్షీణిస్తుందని మార్కెట్‌లో వదంతులు ఉన్నాయి.