MTNLలో BSNL విలీనానికి రంగం సిద్ధం
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (NTNL)తో పాటు భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ (BBL) ఒకే టెలికాం కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ మూడు సంస్థలను విలీనం చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం కేబినెట్‌కు ఓ నోట్ పంపినట్లు ఈనెల 23వ తేదీన ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పత్రిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ కోసం రూ. 44,720 కోట్లు కేటాయించేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టిన విషయం తెలిసిందే. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ల రుణ భారం రూ. 59588 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సంస్థలను ప్రభుత్వం విలీనం చేస్తుందని ఇటీవల బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పుర్వార్ కూడా వెల్లడించారు. ఈ నెలలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.
విలీనం చేయొద్దు
బీఎస్ఎన్ఎల్ యూనియన్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది. తమ సంస్థను ఎంటీఎన్ఎల్లో విలీనం చేయొద్దని ప్రధాన మంత్రికి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. అలా చేయడం వల్ల కోలుకోలేని విధంగా బీఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని యూనియన్ పేర్కొంది. ఈ మేరకు BSNLEU ప్రధాన కార్యదర్శి అభిమన్యూ ఈనెల 23న లేఖ రాశారు.