For Money

Business News

చికెన్‌ ధరలు తగ్గవా?

కొన్ని నెలల క్రితం పౌల్ట్రీ దగ్గర కిలో చికెన్‌ ధర (దీన్నే ఫామ్‌గేట్‌ ధర అని అంటారు) రూ. 70 నుంచి రూ. 80 దాకా ఉండేది. ఇపుడురూ. 125 నుంచి రూ.130 దాకా ఉంటోంది. సాధారణంగా వేసవిలో చికెన్‌ ధర తగ్గుతుంది. కాని ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నారు. దీనికి ప్రధాన కారణం… కోడి దాణా వ్యయం భారీగా పెరగడం. కోడి దాణా కోసం మొక్క జొన్న, సోయాబీన్‌ మీల్‌ వాడుతారు. మొక్కజొన్న ధర 25 శాతం నుంచి 30 శాతం పెరగడంతో టన్ను ధర రూ.21000 నుంచి రూ. 25000 దాటింది. అలాగే సోయాబీన్‌ మీల్ టన్ను ధర రూ. 55,000 నుంచి రూ. 70,000 ఉంటోంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా వీటి ధరలు ఇంకా పెరగడమే గాని… ఇప్పట్లో తగ్గేలా లేవని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
తగ్గిన సరఫరా
సాధారణంగా వేసవి వస్తోందంటే.. చాలా కోళ్ళు చనిపోతుంటాయి. ఇది చిన్న పౌల్ట్రీ యజమానులు బాగా దెబ్బతీసే అంశం. ఇంతకుమునుపు కరోనా సమయంలో దాణా ధర పెరగడంతో పాటు కోళ్ళను చంపేయాల్సి రావడంతో అనేక చిన్న పౌల్ట్రీ ఫామ్‌లు మూతపడ్డాయి. ఆ మేరకు సరఫరా తగ్గింది. ఇపుడు కొత్త ఫామ్‌లు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. మరో వైపు మటన్‌, చేపల ధరలు భారీగా పెరగడంతో చికెన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. పైగా చిన్న పట్టణాల్లో కూడా నాన్‌ వెజ్‌ తినేవారి సంఖ్య పెరగడం. ఇలా పెరిగినవారు చికెన్‌ వైపు మళ్ళుతుండంతో డిమాండ్‌ పెరుగుతోంది. వేసవి ఇంకా ప్రారంభం కాలేదని, సీజన్‌ మొదలైతే కోళ్ళ సరఫరా ఏడు నుంచి ఎనిమిది శాతం తగ్గుతుందని అంటున్నారు.
నగదు సరఫరా తగ్గింది
గత కొన్ని నెలలుగా పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు రావడంతో చాలా మంది పరిశ్రమ నుంచి వైదొలిగారు. అలాగే ముడి పదార్థాల వ్యయం భారీగా పెరగడంతో పెద్ద కంపెనీల లాభదాయకత కూడా తగ్గింది. వెంకీస్‌ వంటి కంపెనీకి కూడా ఈ సమస్య తప్పలేదు. టర్నోవర్‌ భారీగా పెరిగినా… నికర లాభం బాగా పడిపోతోంది. వెంటనే పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని పౌల్ట్రీ రంగం కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. మొక్కజొన్నలు, గోధుమలు, నూకలు సబ్సిడీ ధరకు సరఫరా చేయాలని పౌల్ట్రీ పరిశ్రమ కోరుతోంది. కొత్తగా మళ్ళీ చిన్న పౌల్ట్రీ కంపెనీలు వచ్చి… ఉత్పత్తి పెంచేంత వరకు ధరల్లో తగ్గుదల కష్టమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.