పేటీఎంకు ఆర్బీఐ షాక్
మరికొద్ది రోజుల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభించేందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకున్న పేటీఎంకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభించాలంటే పేమెంట్స్ బ్యాంక్‌కు కనీసం అయిదేళ్ళ అనుభవం ఉండాలి. పీటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు త్వరలోనే అయిదేళ్ళు పూర్తవుతాయి. జూన్‌లో స్మాల్ ఫైనాన్స్బ్యాంక్కు దరఖాస్తు చేయాలని పేటీఎం నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించి కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. ఐటీ సిస్టమ్‌పై పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయాలని పేటీఎంను ఆదేశించింది. తాను మళ్ళీ అనుమతి ఇచ్చే వరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేర్కొంది. 2017 నవంబర్‌లో పేటీఎం పేమెంట్స్ బ్యాంకు సేవలు ప్రారంభమయ్యాయి. బ్యాంకు సంబంధించి తాము జరిపిన తనిఖీల ఆధారంగా తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది.