రష్యాపై ఆంక్షలు: ఎస్బీఐ కీలక నిర్ణయం
ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ దేశాలన్నింటిలో వ్యాపార లావాదేవీలు ఉండటంతో… ఈ ఆంక్షలను గౌరవించాల్సి ఉన్నందున ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏయే కంపెనీలపై ఆంక్షలు విధించారో.. ఆ కంపెనీలతో ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదని ఎస్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు తన క్లయింట్లకు లేఖ రాసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఎస్బీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే మీడియాలో వస్తున్న వార్తలకు స్పందించలేదు. ఏ కరెన్సీలో లావాదేవీలు జరిగినా.. ఆంక్షలు విధించిన కంపెనీలకు సంబంధించిన లావాదేవీలను తాము జరపడం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో పాటు ఐక్యరాజ్య సమితి నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న సంస్థలు, బ్యాంకులు, రేవులు, షిప్ కంపెనీలతో ఎస్బీఐ ఇక ఎలాంటి లావాదేవీలు జరపదని పేర్కొంది. ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాలు, కంపెనీలతో డీల్ చేసే సమయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తన క్లయింట్లకు ఎస్బీఐ సలహా ఇచ్చింది. ఎస్బీఐకి విదేశాలలో భారీ బ్రాంచ్ నెట్వర్క్ ఉంది. దీంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. రష్యాతో ఆయిల్ కంపెనీలకు అధిక లావాదేవీలు ఉంటాయి. అక్కడి కంపెనీల్లో వాటాతో పాటు పలు లావాదేవాలు నిర్వహిస్తుంటాయి. వీటికి సంబంధించి డేటా ఇవ్వాల్సిందిగా ఎస్బీఐ కోరినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.