దాడులు కొనసాగితే స్విఫ్ట్ నుంచి రష్యా ఔట్?
ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగించే పక్షంలో రష్యాను ‘స్విఫ్ట్’ వ్యవస్థ నుంచి బహిష్కరించాలని అమెరికా, కెనెడా, బ్రిటన్‌తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు అంటున్నాయి. జర్మనీ కూడా సరే అంటున్నా… కాస్త ఆలోచిస్తోంది. రష్యాతో జర్మనీకి వాణిజ్య లావాదేవీలు అత్యధికంగా ఉన్నాయి. దీంతో ఆలోచించి చెబుతామని చెబుతోంది. ఇటలీ మాత్రం వ్యతిరేకిస్తోంది. మిగిలిన దేశాలన్నీ రష్యాపై వేటుకు సరేనంటున్నాయి. వివిధ దేశాల మధ్య నగదు చెల్లింపు కోసం అంతర్జాతీయంగా ఆమోదం పొందిన మెసేజింగ్ సిస్టమ్ ‘స్విఫ్ట్’ (SWIFT). ఈ వ్యవస్థ నుంచి బయటకు వెళ్ళడమంటే… విదేశాలతో రష్యా నగదు లావాదేవీలు బంద్ అయినట్లే. ఆంక్షల్లో ఇది చాలా తీవ్రమైన అంశం. చివరి అస్త్రంగా దీన్ని ఉపయోగించాలని అమెరికా మిత్రదేశాలు భావిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఒక దేశం మరో దేశంపై చేసిన అతి పెద్ద దాడిగా ఉక్రెయిన్ దాడిని పేర్కొంటున్నారు. పరిస్థితి మరింత విషమించకుండా ఉండాలంటే రష్యాను కట్టడి చేయక తప్పదని అమెరికా మిత్ర దేశాలు భావిస్తున్నాయి.