ఆ ఆర్టికల్స్ తొలగించండి
బ్రెజిల్‌లో కోవాగ్జిన్ సరఫరా విషయంలో భారత్ బయోటెక్ కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ‘ద వైర్’ వెబ్‌సైట్‌లో వరుస కథనాలు వచ్చాయి. ఈ కథనాలను సవాలు చేస్తూ ‘ద వైర్’పై రూ.100 కోట్లకు భారత్ బయోటెక్ కంపెనీ రంగారెడ్డి జిల్లా కోర్టులో పరువు నష్టం కేసు వేసింది. పిటీషన్ విచారించిన జిల్లా కోర్టు 14 కథనాలను వెబ్‌సైట్ నుంచి తొలగించాల్సిందిగా ద వైర్‌కు ఆదేశాలు ఇచ్చింది. భారత్ బయోటెక్ పరువుకు నష్టం కల్గించే కథనాలు ప్రచురించరాదని ద వైర్‌తో పాటు ఆ వెబ్‌సైట్ వ్యవస్థాపకులు సిద్ధార్థ్ వరదరాజన్, ఎస్‌ఆర్ భాటియా, ఎంకే వేణులను ఆదేశించింది. భారత్ బయోటెక్ తరపున సీనియర్ లాయర్ వివేక్ రెడ్డి వాదించారు. భారత్ బయోటెక్ పరువుకు నష్టం కల్గించే విధంగా దురుద్దేశంతో కంపెనీ, కోవాగ్జిన్‌పై తప్పుడు ఆరోపణలతో ద వైర్ కథనాలు రాసిందని వివేక్ రెడ్డి వాదించారు. తన పిటీషన్‌లో ద వైర్ పబ్లిషర్ అయిన ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం, సిద్ధార్థ్ వరదరాజన్, ఎస్ ఆర్ భాటియా, ఎంకే వేణు, నీతా సంఘి, వాసుదేవన్ ముకుంద్, శోభన్ సక్సేనా, ఫ్లోరెన్సియా కోసా, ప్రేమ్ ఆనంద్ మురుగన్, బంజెత్ కౌర్, ప్రియాంక పుల్ల, సెరాజ్ అలీ, జమ్మి నాగరాజ రావులను ప్రతివాదులుగా పేర్కొంది.