ధరలు తగ్గించండి
వంటనూనెల గరిష్ఠ చిల్లర ధర (MRP)ను తగ్గించాలని తయారీ సంస్థలను ఆ పరిశ్రమ సంఘం సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) కోరింది. వినియోగదారులకు ఊరట కల్పించేలా వెంటనే కిలోకు రూ.3-5 మేర తగ్గించాలని ఓ ప్రకటనలో తమ సభ్యులకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం దేశీయ అవసరాల్లో 60 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినందున దేశీయ మార్కెట్లో ధరలు తగ్గాల్సిన అవసరం ఉందని అసోసియేషన్ కోరింది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఆయా రకాలనుబట్టి కిలో వంటనూనె సగటు ధరలు రూ.130.53 నుంచి రూ.187.03గా మధ్య ఉంటున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో రూ.164.55గా ఉన్న కిలో వేరుశనగనూనె ఇప్పుడు రూ.177.75 ఉంది.ఇక ఆవ నూనె కూడా రూ.145.02 నుంచి రూ.187.03కు పెరిగింది. సోయా నూనె ధర రూ.126.03 నుంచి రూ.147.36కు చేరింది.ఇక సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.144.22 నుంచి రూ.161.75కు, మార్కెట్లో అత్యధికంగా వాడే పామాయిల్ ధర రూ.113.89 నుంచి రూ.130.53కు పెరిగింది. ఈ నేపథ్యంలో కంపెనీలు ధరలు తగ్గించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.