రైల్వే ప్రయాణికులకు క్రెడిట్ కార్డు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (BFSL)లతో కలిసి రైల్వే ప్రయాణికుల కోసం IRCTC ప్రత్యేకంగా ఓ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టారు. రైళ్లలో ఎక్కువగా ప్రయాణించేవారికి గరిష్ఠంగా ఆదా చేసేలా ఈ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇంధనం, పప్పు దినుసులనూ ఈ కార్డుపై కొనుక్కోవచ్చని, జేసీబీ నెట్వర్క్ ద్వారా ఏటీఎంలు, అంతర్జాతీయ వ్యాపారుల వద్ద కూడా దీన్ని వినియోగించవచ్చన్నారు.
ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా 1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, సీసీ లేదా ఈసీ బుకింగ్స్ కోసం ఖర్చుచేసే ప్రతి రూ.100కు 40 రివార్డు పాయింట్లు ఉంటాయి. రైలు టిక్కెట్ల బుకింగ్స్‌పై 1 శాతం లావాదేవీ ఫీజు తగ్గింపు ఉంటుంది. అలాగే దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో జరిపే లావాదేవీలపై ఇంధన సర్‌చార్జీ 1 శాతం ఉండదు.