కల్పతరు పవర్లో జేఎంసీ ప్రాజెక్ట్స్ విలీనం
కల్పతరు పవర్ ట్రాన్సిమిషన్ లిమిటెడ్‌లో జేఎంసీ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ విలీనం కానుంది. ఈ మేరకు రెండు కంపెనీల బోర్డులు ఇవాళ భేటీ అయి తమ ఆమోదం తెలిపాయి. దీనివల్ల ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ)లో ఓ పెద్ద కంపెనీ అవతరించినట్లవుతుంది. విలీన ప్రతిపాదన ప్రకారం జేఎంసీ ప్రాజెక్ట్‌కు చెందిన ప్రతి నాలుగు షేర్లకు ఒక కల్పతరు పవర్ షేర్లను కేటాయిస్తారు. ఎన్సీఎల్టీ గుజరాత్ బెంచ్ తుది ఆమోదంతో ఈ విలీనం పూర్తవుతుందని కంపెనీలు తెలిపాయి. ఇంకా ఇతర లాంఛనాలను కూడా పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. రెండు కంపెనీల విలీనం తరవాత కంపెనీ వద్ద ఆర్డర్ బుక్ రూ. 37,000 కోట్లకు చేరుతుంది. 2025కల్లా 300 కోట్ల డాలర్ల టర్నోవర్ కంపెనీగా వృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమని కల్పతరు ఛైర్మన్ మొఫ్తరాజ్ మునోత్ తెలిపారు. ఈ రెండు కంపెనీలు లిస్టెడ్ కంపెనీలు. శుక్రవారం కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ షేర్ రూ.389 వద్ద క్లోజ్ కాగా, జేఎంసీ ప్రాజెక్ట్స్ షేర్ రూ. 94 వద్ద ముగిసింది.