గ్రాసిం లాభంలో 23 శాతం వృద్ధి
డిసెంబరు త్రైమాసికంలో రూ.2655.45 కోట్ల నికరలాభాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. 2020-21 ఇదే కాలంలోని లాభం రూ .2157.12 కోట్లతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. కంపెనీ ఆదాయం మాత్రం స్వల్పంగా 6 శాతం పెరిగి రూ .21000 కోట్ల నుంచి రూ .24402 కోట్లకు చేరింది. ఎరువుల వ్యాపారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించడంతో, స్టాండ్అలోన్ ఖాతాల ప్రకారం 2022 జనవరి 1 నాటికి నికర అప్పులు లేని కంపెనీగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మారినట్లు సంస్థ వెల్లడించింది. పెయింట్ వ్యాపారంలోకి ప్రవేశించిన ఈ కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా అయిదు ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. పానిపట్ , లూధియానా ప్లాంట్లకు పర్యావరణ అనుమతి లభించినట్లు గ్రాసిం పేర్కొంది.