ఎల్ఐసీ ఇష్యూ ధర రూ. 1,693- రూ.2,962?
ఇపుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ గురించే చర్చ. ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడంతో ఇపుడు పబ్లిక్ ఇష్యూ షేర్ ధర ఎంత ఉంటుందనే అంశంపై అనేక రకాల లెక్కలు వేస్తున్నాయి. ఎల్ఐసీ వాస్తవ విలువ రూ. 5.39 లక్షల కోట్లని ప్రాస్పెక్టస్‌లో పేర్కొన్నారు. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో వాస్తవ ధరకు నాలుగు రెట్లు అధికంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుంది. అయితే ప్రభుత్వం ఎన్ని రెట్లు లెక్కిస్తుందనేది ఇపుడు సస్పెన్స్‌గా మారింది. చాలా మంది రెండు నుంచి 3.8 రెట్లు అధిక వ్యాల్యూయేషన్ వేయొచ్చని అంటున్నారు. అంటే రూ. 10.7 లక్షల కోట్ల నుంచి రూ. 18.7 లక్షల కోట్ల వరకు ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ను ప్రభుత్వం నిర్ణయించే అవకాశముంది. ఎల్ఐసీ మూలధన రూ. 6324 కోట్లు. అంటే 632.4 కోట్ల షేర్లు. ఇందులో 5 శాతం పబ్లిక్ ఆఫర్ చేయాలని ప్రభుత్వం అంటోంది. అంటే ఈ ఇష్యూ నుంచి ప్రభుత్వం రూ. 53500 కోట్లు లేదా రూ. 93635 కోట్లు వసూలు చేయొచ్చు. అంటే కనిష్ఠంగా చూస్తే పబ్లిక్ ఆఫర్ ధర రూ. 1693 ఉండొచ్చు. లేదా గరిష్ఠ ధరకు ఆఫర్ చేయాలంటే రూ. 2962లుగా నిర్ణయించే అవకాశముందని మనీకంట్రోల్ డాట్ కామ్ లెక్క గట్టింది. ప్రభుత్వానికి ఒక్కో షేర్ 16పైసలు పడుతోంది. నిజానికి ఎల్ఐసీని రూ.100 కోట్లతో ప్రారంభించారు. అప్పటి నుంచి కంపెనీ మూలధనంలో ఎలాంటి మార్పు లేదు. పబ్లిక్ ఆఫర్ చేయాలని నిర్ణయించిన తరవాత ప్రభుత్వానికి ఎల్ఐసీ షేర్లను జారీ చేసింది. అలా ఇపుడు ఎల్ఐసీ ఈక్విటీ రూ. 6,324 కోట్లకు చేరింది.