For Money

Business News

రాహుల్ బజాజ్‌ మృతి

ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్‌ ఆటో మాజీ ఛైర్మన్‌ రాహుల్ బజాజ్‌ కొద్దిసేటి క్రితం మృతి చెందారు. ఆయన వయసు 83 ఏళ్ళు. న్యూమోనియాతో పాటు గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన మృతి చెందారు. 1938 జూన్‌ 10న ఆయన జన్మించారు. ప్రముఖ స్వతంత్ర సమర యోధుడైన జమన్‌లాల్‌ బజాజ్‌కు రాహుల్‌ బజాజ్‌ మనవడు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థి అయిన రాహుల్‌ బజాజ్‌ 1965లో బజాజ్‌ గ్రూప్‌ పగ్గాలు చేపట్టారు. 2005లో ఆయన గ్రూప్‌ బాధ్యతలను కుమారుడు రాజీవ్‌ బాజాజ్‌కు అప్పజెప్పారు. 2006 నుంచి 2010 వరకు ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 2001లో కేంద్ర ప్రభుత్వం రాహుల్‌ బజాజ్‌ను పద్మ భూషణ్‌తో సత్కరించింది. బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ కంపెనీలను ప్రముఖ సంస్థలుగా తీర్చిదిద్దడంలో రాహుల్‌ బజాజ్‌ పాత్ర కీలకం. హమారా బజాజ్‌ అంటూ బజాజ్‌ కంపెనీకి కొత్త ఊపిరి పోశారు. అద్భుతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాహుల్‌ బజాజ్‌… అవసరమైపుడల్లా పారిశ్రామిక రంగం తరఫున ప్రభుత్వంతో పోరాడేందుకు ముందుకు వచ్చేవారు. అమిత్‌ షా సమక్షంలోనే ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇందిగాంధీ హయాంలోని లైసెన్స్‌ రాజ్‌కు వ్యతిరేకంగా కూడా తీవ్ర పోరాటం చేశారు.