ఒక్క మాట…కుప్పకూలిన వాల్‌స్ట్రీట్
రాత్రి వాల్‌స్ట్రీట్ ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్న సమయంలో ఫెడరల్ రిజర్వ్ అధికారి ఒకరు చేసిన కామెంట్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నాస్డాక్ మళ్ళీ 2.10 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.81 శాతం, డౌ జోన్స్ 1.47 శాతం నష్టంతో క్లోజయ్యాయి. గత 40 ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా 7.5 శాతం మేర అమెరికా ద్రవ్యోల్బణం పెరగడం, అలాగే నిరుద్యోగ భృతి కోసం వచ్చే క్లయిముల సంఖ్య తగ్గడంతో … ఫెడ్ వడ్డీ రేట్లను పెంచక తప్పదని తేలిపోయింది. సెయింట్ లూయిస్ రాష్ట్ర ఫెడ్ అధ్యక్షుడు జేమ్స్ బుల్లర్డ్వడ్డీ రేట్లపై చేసిన కామెంట్లతో అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్లూమ్‌బర్గ్‌తో ఆయన మాట్లాడుతూ జూలైకల్లా ఒక శాతం మేర వడ్డీ రేటుల పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. మార్చిలో ఫెడ్ 0.25 లేదా 0.5 శాతం వడ్డీని పెంచవచ్చని మార్కెట్ భావిస్తోంది. బుల్లర్డ్ తాజా వ్యాఖ్యలతో మార్చిలో 0.5 శాతం మేర వడ్డీ రేట్ల పెంపు ఖాయంగా కన్పిస్తోంది. ఇక జులైకల్లా ఒక శాతం అంటే… మరోమారు 0.5శాతం వడ్డీ రేట్లను పెంచుతారన్నమాట. ఈ ఏడాదిలో మొత్తం నాలుగు సార్లు వడ్డీ రేట్లను పెంచుతామని ఫెడ్ ఇదివరకే ప్రకటించింది. ఇపుడు అమెరికా మార్కెట్లలో వడ్దీ రేట్లు హాట్ టాపిక్‌గా మారిపోయాయి. బాండ్ ఈల్డ్స్ నిన్న మళ్లీ పుంజుకున్నారు. డల్‌గా ఉన్న డాలర్ కూడా రాత్రి కోలుకుంది. 95 దిగువకు వెళుతుందేమో అని అనుకున్న డాలర్ ఇండెక్స్ రాత్రి 95.84కి చేరింది. మరోవైపు క్రూడ్ ధరలు క్షీణించాయి. బ్రెంట్ 91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక బులియన్ కూడా చల్లబడింది. వెండి ఒకశాతంపైగా పడింది.