For Money

Business News

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ ప్రక్రియ షురూ

ఎల్‌ఐసీ ఐపీవోకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ప్రాస్పెక్టస్‌ను క్లియర్‌ చేసేందుకు ఇవాళ ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం జరగనుంది. ప్రాస్పెక్టస్‌ను బోర్డు ఆమోదించిన తరవాత ఇవాళ స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఎల్‌ఐసీ తన ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. దీంతో పబ్లిక్‌ ఆఫర్‌ ప్రక్రియ ప్రారంబమైనట్లే. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయించనున్నట్లు సమాచారం. ఎల్‌ఐసీలో ప్రభుత్వం వద్ద మొత్తం 632 కోట్ల షేర్లు ఉండగా, అందులో 5 శాతం అంటే.. 31 కోట్ల షేర్లను పబ్లిక్‌కు ఐపీవోలో విక్రయిస్తారని తెలుస్తోంది. ఇష్యూలో తాజా షేర్ల జారీ మాత్రం ఉండదు. ఇంత భారీ పబ్లిక్‌ ఇష్యూను మన ఈక్విటీ మార్కెట్‌ అందిపుచ్చుకోలేదన్న అనుమానాలతో ఐపీవోను రెండు భాగాలుగా జారీ చేయాలని నిర్ణయించారు. తొలిదశలో 5 శాతం షేర్లను అమ్మకాలని నిర్ణయిస్తారు. ఎల్‌ఐసీఎంటర్‌ప్రైజ్‌ విలువ (ఈవీ)తో పాటు ఇతర కీలక అంశాలు ప్రాస్పెక్టస్‌లో బయటపడే అవకాశముంది. ఎంత వాటాను విక్రయిస్తారు? ఎంత సమీకరించాలని ప్రతిపాదించారు.. వంటి వివరాలు ప్రాస్పెక్టస్‌లో వెల్లడిస్తారు. ఈ బీమా దిగ్గజానికి 20,300 కోట్ల డాలర్ల విలువను (దాదాపు రూ. 15 లక్షల కోట్లు) ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు బ్లూంబర్గ్‌ ఇటీవల తెలిపింది.