క్రిప్టో కరెన్సీలతో తీవ్ర ప్రమాదం
క్రిప్టో కరెన్సీలతో దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ప్రమాదం ఉంటుందని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్బీఐ పరపతి విధానాన్ని ఆయన ప్రకటిస్తూ ఇవాళ ఆయన ఈ హెచ్చరిక చేశారు. ముఖ్యంగా ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలలో ట్రేడ్ చేసేవారు వారి సొంత రిస్క్‌తో చేసుకోవాలని అన్నారు. ”క్రిప్టో కరెన్సీల విషయంలో మా విధానం చాలా స్పష్టం. దేశ స్థూల ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టో కరెన్సీలు పెద్ద ప్రమాదం. ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన అంశాలను కంట్రోల్ చేయడానికి ఇపుడు ఆర్బీఐకి ఉన్న సామర్థ్యాన్ని ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలు దెబ్బతీస్తాయి” అని ఆయన అన్నారు. క్రిప్టో కరెన్సీలకు ఎలాంటి విలువ లేదని ఆయన అన్నారు. క్రిప్టో కరెన్సీలలో ట్రేడ్ చేసేవారికి హెచ్చరించాల్సిన బాధ్యత ఉందని కాబట్టి చెబుతున్నామని… వీటిలో ట్రేడింగ్ చేసేవారు తమ సొంత రిస్క్‌తో వీటిలో పెట్టుబడి పెడుతున్నట్లు గుర్తించాలని శక్తికాంత దాస్ అన్నారు. క్రిప్టో కరెన్సీలకు ఓ పువ్వు (తులిప్)కు ఉన్న విలువ కూడా లేదని గుర్తించాలని ఆయన హెచ్చరించారు. డిజిటల్ రూపీ విషయంలో కూడా ఆర్బీఐ అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని, తొందరపడదల్చుకోలేదని ఆయన అన్నారు.