For Money

Business News

అనిల్‌ అంబానీ కంపెనీలపై సీబీఐ కేసు?

అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీల్లో ఎస్‌ బ్యాంక్‌ పెట్టిన పెట్టుబడుల్లో తీవ్ర స్థాయిలో అవినీతి, అధికార దుర్వినియోగం జరిగినట్లు సీబీఐ తేల్చింది. మాజీ ప్రమోటర్‌ రానా కపూర్‌ బ్యాంక్‌ అధినేతగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రెండు ప్రధాన కంపెనీలకు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సీబీఐ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చిందని ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (RCFL), రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (RHFL)లలో నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. RCFLకు చెందిన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ),ఇతర సాధనాల్లో రూ. 1,400 కోట్లను ఎస్‌ బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ చేసింది. ఇది రిలయన్స్‌ క్యాపిటల్‌కు అనుబంధ కంపెనీ. అలాగే RHFLలో రూ. 2,965 కోట్లను ఎస్‌ బ్యాంక్‌ ఇన్వెస్ట్‌ చేసింది.2019 డిసెంబర్‌లో జరిగిన ఈ డీల్‌కు అర్ధరాత్రి 0.49 గంటలకు రానాకపూర్‌తో పాటు ఇతర రుణ మంజూరు కమిటీ సభ్యులు కేవలం మూడు సెకన్లలో ఆమోదం తెలిపారని సీబీఐ తేల్చింది. ఈ కంపెనీలన్నీ ముంబై కేంద్రంగా ఉన్నాయి. సీబీఐకి సాధారణ సమ్మతిని మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో ప్రతి ఒక్క కేసును ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపి.. అనుమతి తీసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. దీని బదులు మరో కేంద్రంగా ఈ కేసును దర్యాప్తు చేసే విషయంలో లీగల్‌ విభాగం అభిప్రాయాన్ని సీబీఐ కోరింది.