భారీ లాభాల్లో ముగిసిన నిఫ్టి
మార్కెట్ దృష్టిలో బడ్జెట్ వచ్చింది… పోయింది. నిజానికి బడ్జెట్‌కు మార్కెట్ మైనస్ మార్కులు వేసింది. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తరవాత నిఫ్టి నష్టాల్లోకి జారుకుంది. అయితే యూరో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ కావడంతో మళ్ళీ లాభాల్లోకి వచ్చింది. బడ్జెట్‌కు ముందు ఏ స్థాయిలో ఉందో… బడ్జెట్ తరవాత అదే స్థాయికి చేరి ముగిసింది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లలో నాస్‌డాక్ 3 శాతంపైగా లాభపడటంతో ఇవాళ మార్కెట్ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమై 17622 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. బడ్జెట్‌కు రియాక్షన్‌గా 17,244కు పడిపోయింది. యూరో మార్కెట్లు దాదాపు ఒక శాతం వరకు లాభాలతో ట్రేడ్ కావడంతో కోలుకుని… 17,576 వద్ద ముగిసింది. నిఫ్టి 237 పాయింట్లు లాభాలతో క్లోజ్ కాగా, సెన్సెక్స్ 848 పాయింట్లు లాభపడింది. బడ్జెట్‌కు ఒక్క స్టీల్ షేర్లు తప్ప.. ఇతర షేర్లలకు పెద్దగా మద్దుతు లేదు. అన్ని ఉదయం లాభాలను కొనసాగించాయి. ఇతర సూచీలు కూడా ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. నిఫ్టి టాటా స్టీల్ టాప్ గెయినర్ కాగా, బీపీసీఎల్ 4.4 శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌లో జిందాల్ స్టీల్ టాప్ గెయినర్ కాగా, టాప్ లూజర్ హెచ్‌పీసీఎల్. మిడ్ క్యాప్‌లో కూడా బడ్జెట్‌కు స్పందిన షేర్లు లేవు. అన్నీ ఉదయం నుంచి లాభాల్లో ఉన్న షేర్లే. ఒక్కముక్కలో చెప్పాలంటే.. మార్కెట్ బడ్జెట్‌ను పట్టించుకోలేదు. పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ట్రేడైంది.