కాళేశ్వరం ప్రాజెక్టు అధికారి కుమార్తె పెళ్ళికి ‘మెగా పెళ్ళి’ కానుక
పెద్ద మీడియా సంస్థలు ప్రభుత్వాల ప్రకటనలకు అర్రులు చాస్తూ… వాటి భజనలో తరిస్తుంటే… ప్రభుత్వ అవినీతిని వెలికి తీసి… ఎండగట్టే పనిని న్యూస్ వెబ్‌సైట్‌లు చేపట్టాయి. కాళేశ్వరం అంటే అవినీతికి నిలయమని ఎప్పటి నుంచో విపక్షాలు అంటున్నారు. కేవలం కమీషన్ల కోసం కడుతున్న ప్రాజెక్టు కాళేశ్వరమని కూడా విమర్శించాయి. ఆ ప్రాజెక్టు కాంట్రాక్ట్ చేపట్టిన ‘మెగా ఇంజినీరింగ్’పై వచ్చిన అవినీతి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు లేరు. కాళేశ్వరం ప్రాజెక్టును పర్యవేక్షించిన ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కుమార్తె పెళ్ళికి మెగా కాంట్రాక్ట్ లక్షల రూపాయలు బిల్లులు భరించి… తన వంతుగా కానుకలు ఇచ్చిన వైనాన్ని ‘ద న్యూస్ మినిట్’ వెబ్‌సైట్ వెలికి తీసింది. వైట్‌మనీ రూపంలో సాగిన లావాదేవీలను ఆయన వెబ్‌సైట్ బయట పెట్టింది. బోగస్ కంపెనీల భాగోతం బయటపెట్టింది. మరి అనధికారిక బిల్లుల రూపంలో ఈ పెళ్ళికి ఎంత ఖర్చు చేసిందో? ఈ ‘మెగా పెళ్ళి’ కానుకపై ‘ద న్యూస్ మినిట్’లో వచ్చిన కథనం ఇది….
కాళేశ్వరం ప్రాజెక్టును పర్యవేక్షించే తెలంగాణ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అయిన రజత్ కుమార్ కుమార్తె పెళ్ళికి మెగా ఇంజినీరింగ్ కంపెనీ యజమాని అన్నీ తానై సమకూర్చి… లక్షలు ఖర్చు పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ద న్యూస్ మినిట్ దీనికి సంబంధించి ఓ ప్రత్యేక కథనం ప్రచురించింది. గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఈ పెళ్ళి వెనుక సాగిన ‘నిధుల కానుక’ను బయట పెట్టింది. ఈ పెళ్ళి ఖర్చులను భరించేందుకు మెగా గ్రూప్‌నకు చెందిన బిగ్ వేవ్ ఇన్‌ఫ్రా అనే ఓ సూట్‌కేస్ కంపెనీని ఉపయోగించారు. ఇదే గ్రూప్‌నకు చెందిన ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్ కంపెనీని కూడా మెగా గ్రూప్ ఉపయోగించింది. ఇంటరాక్టివ్ డేటా సిస్టమ్స్‌లో పనిచేసిన డైరెక్టర్లు.. చాలా మంది మెగా గ్రూప్‌నకు చెందిన అనేక కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండటం విశేషం.
అన్నీ బుకింగ్స్ వీరివే…
రజత్ కుమార్ కుమార్తె అంజలి పెళ్ళి అంగరంగ వైభవంగా కేవలం పెద్ద పెద్ద కోటీశ్వరులకు మాత్రమే పరిమితమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించడం విశేషం. వచ్చే అథితుల కోసం ఈ హోటల్‌తో పాటు తాజ్ గ్రూప్‌నకు చెందిన తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్, తాజ్ ఫలక్‌నుమా హోటల్స్‌లో కూడా ఈ రెండు కంపెనీల నుంచి బుకింగ్స్ చేసినట్లు ‘ద న్యూస్ మినిట్’ వెల్లడించింది. దీనికి కోసం కంపెనీ ఈమెయిల్ ఐడీలను కూడా ఉపయోగించారు. వీటిలో కొన్ని డమ్మీ ఈమెయిల్స్ కూడా ఉండటం ఒక విశేషమైతే.. వాటిపై కంపెనీ అధికారులు సంతకాలు చేయడం మరో విశేషం. గత ఏడాది డిసెంబర్ 17న మెగా గ్రూప్‌లో కీలక వ్యక్తి, మెగా ఇంజినీరింగ్‌లో అసోసియేట్ మేనేజర్ అయిన మురళీ ద్వారా తాజ్ కృష్ణలోని అల్ ఫ్రెస్కో లాన్‌ను బుక్ చేసినట్లు ‘ద న్యూస్ మినిట్’ బయట పెట్టింది. అలాగే డిసెంబర్ 19,20,21 తేదీలలో తాజ్ కృష్ణాలో అతిథులకు రూమ్‌లు కూడా బుక్ చేశారు. ఇవన్నీ కూడా డిసెంబర్ 13వ తేదీనే ఖరారైనట్లు పేర్కొంటూ… అందుకు సంబంధించిన ఆధారాలను కూడా బయటపెట్టింది. విచిత్రమేమిటంటే ఈ డీల్స్ అన్నీ స్వయంగా ఐఏఎస్ ఆఫీసర్ రజత్ కుమార్ చూడటం. ఆయన ఎఎస్టీగా ఉన్న ప్రభాకర్ రావు… మెగా ఇంజినీరింగ్ అధికారులతో సంప్రదింపులు చేసి మొత్తం కార్యక్రమాలను సెట్ చేసినట్లు వెబ్‌సైట్ పేర్కొంది. హోటల్‌కు సంబంధించిన రూ. 23 లక్షల బిల్లును బిగ్‌వేవ్ అనే సూట్‌కేస్ కంపెనీ చెల్లించడం విశేషం. అయితే ఈ ఆరోపణలను రజత్ కుమార్ ఖండించారు. ఆ కంపెనీ పేరే తెలియదని బుకాయించారు. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ కోసం ‘ద న్యూస్ మినిట్’ వెబ్‌సైట్ మెగా ఇంజినీరింగ్‌లో అసోసియేట్ మేనేజర్ అయిన కె మురళిని సంప్రదించింది. ఆయన తరఫున మెగా పబ్లిక్ రిలేషన్స్ అధికారి శివ ప్రసాద్ రెడ్డి బెంగళూరులోని ‘ద న్యూస్ మినిట్’ కార్యాలయాలన్ని సందర్శించాడు. న్యూస్ మినిట్ చూపిన డాక్యుమెంట్లు తప్పుడు డాక్యుమెంట్లను చెప్పిన ఆయన… మొత్తం కథనాన్ని మాత్రం ఖండించకపోవడం విశేషం.
Click Here to read Original story in English