కేజీ బేసిన్లో రిలయన్స్‌కు కనకవర్షం
కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్యాస్ ఉత్పత్తి అనూహ్యంగా పెంచింది. పైగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు కూడా భారీగా పెరగడంతో రిలయన్స్‌కు భారీగా లబ్ది చేకూరనుంది. అంతర్జాతీయ గ్యాస్ ధరలను అనుగుణంగా ప్రతి ఆరునెలలకు ఒకసారి కేంద్రం గ్యాస్ ధరలను సవరిస్తుంది. ఇది ఈసారి రిలయన్స్ బాగా కలిసివస్తోంది. గ్యాస్ ధర 60 శాతం పెరిగి ఒక mbtuకు పది డాలర్లకు చేరినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంత క్రితం ఏడాది త్రైమాసికంతో పోలిస్తే రిలయన్స్ కంపెనీ గ్యాస్ ఉత్పత్తి 36 రెట్లు పెరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది. భాగస్వామ్య సంస్థ అయిన బీపీ పీఎల్సీతో కేజీ బేసిన్లో కలిసి గ్యాస్ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం రోజుకు 1.8 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేస్తుండగా, 2023 కల్లా ఇది రోజుకు 3 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుందని రిలయన్స్ భావిస్తోంది. చాలా రోజుల తరవాత ఈ విభాగంలో కంపెనీ టర్న్ అరౌండ్ సాధించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో చమురు, గ్యాస్ ఉత్పత్తి ద్వారా ఆదాయం రూ. 2,560 కోట్లకు చేరింది.