For Money

Business News

రెండు కంపెనీలుగా జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా

జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (జీఐఎల్‌)ను రెండు కంపెనీలను విభజించనున్నారు. విద్యుత్తు, రోడ్డు ప్రాజెక్టులు, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులను ఒక విభాగంలోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. దీనికిగాను జీఎంఆర్‌ పవర్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ (జీపీయూఐఎల్‌) అనే పేరుతో ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద విమానాశ్రయాల వ్యాపారం కొనసాగుతుంది. దీనికి ఈ నెల 12వ తేదీని ‘రికార్డు తేదీ’ గా నిర్ణయించారు. ఆ రోజు నాటికి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వాటాదార్లుగా ఉన్నవారికి, ప్రతి 10 జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేర్లకు (రూ.1 ముఖ విలువ), ఒక జీపీయూఐఎల్‌ షేరు (రూ.5 ముఖ విలువ) కేటాయిస్తారు. విమానాశ్రయాల విభాగంలో శరవేగంగా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రస్తుతం పలు దేశీయ విమానాశ్రయాల ప్రాజెక్టులు నిర్వహించడమే కాకుండా, విదేశాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడుతోంది.