For Money

Business News

ఐపీఓ మార్కెట్‌ నిబంధనలు మరింత కఠినం

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా సమీకరించిన నిధుల్లో విలీనాలు/ కొనుగోళ్లు (ఇన్‌ ఆర్గానిక్‌ గ్రోత్‌), సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం 35 శాతం కేటాయించాలన్న ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపింది. అయితే ఫలానా కొనుగోలు లేదా వ్యూహాత్మక పెట్టుబడికి ఐపీఓ నిధులు ఉపయోగిస్తామనే విషయాన్ని ముందుగానే ఐపీఓ దరఖాస్తు పత్రాల్లో పొందుపరిస్తే పై పరిమితి వర్తించదని పేర్కొంది. మంగళవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో సెబీ పలు నిర్ణయాలు తీసుకుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడికి ‘లాక్‌ ఇన్‌ పీరియడ్‌’ను 90 రోజులకు పెంచింది. 2022 ఏప్రిల్‌ 1న లేదా ఆ తర్వాత నుంచి ప్రారంభమయ్యే అన్ని ఇష్యూలకు ఇది వర్తించనుంది. ప్రస్తుతం చిన్న మదుపర్లకు వర్తింపచేస్తున్న ‘డ్రా ఆఫ్‌ లాట్స్‌’ విధానం ఆధారంగానే ఎన్‌ఐఐలకూ షేర్ల కేటాయింపు జరగాలని తెలిపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు), ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లు, మ్యూచువల్‌ ఫండ్‌లు, సెటిల్‌మెంట్‌ ప్రక్రియల నిబంధనల్లో సవరణలకు కూడా ఆమోదం తెలిపింది. షోకాజ్‌ నోటీసులు లేదా అనుబంధ నోటీసులు అందిన తేదీ నుంచి 60 రోజుల్లోగా సెటిల్‌మెంట్‌ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని సెబీ తెలిపింది.